10-08-2025 01:11:30 AM
- హైదరాబాద్‌లో స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- జీహెఎంసీతో పాటు సమీపంలోని ప్రాంతాలకూ వర్తింపు
- హైడ్రాలిక్ మోడలింగ్, జియో-రిఫరెన్సింగ్‌తో శాస్త్రీయ సర్వే
- నిపుణులైన సంస్థల నుంచి మాస్టర్ ప్లాన్ రూపకల్పన
హైదరాబాద్ సిటీబ్యూరో, అగస్టు 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం, దాని పరిసర ప్రాంతాలను ఏటా ముంచెత్తుతున్న వరద ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ మొత్తానికి వర్తించేలా ఒక “సమగ్ర స్టార్మ్ వాటర్ డ్రైనేజీ మాస్టర్ ప్లాన్” రూపకల్పనకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బృహత్ ప్రణాళికను సిద్ధం చేసేందుకు అర్హులైన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించాలని జీహెఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రానికి ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో తరచూ సంభవిస్తున్న పట్టణ వరదలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేవలం జీహెఎంసీ పరిధిలోనే కాకుండా, దాని చుట్టూ విస్తరించి ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల డ్రైనేజీ వ్యవస్థ కూడా నగరంలోని మూసీ నది, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి ప్రధాన జలాశయాలతో అనుసంధానమై ఉంది. ఈ నేపథ్యంలో, సమస్యను సమూలంగా పరిష్కరించాలంటే ఒక సమగ్ర ప్రణాళిక అవసరమని జీహెఎంసీ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పరిశీలించిన ప్రభుత్వం “తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కోసం సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్” తయారీకి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
మాస్టర్‌ప్లాన్‌తో కలిగే ప్రయోజనాలు
సమర్థవంతమైన వరద నివారణకు భారీ వర్షపాతం సమయంలో కూడా నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి శాశ్వత చర్యలు చేపడతారు. నీటి నాణ్యత పరిరక్షణ, మురుగునీరు, కాలుష్య కారకాలు నాలాలు, చెరువుల్లోకి చేరకుండా ఉత్తమ యాజమాన్య పద్ధతులు అమలు చేస్తారు. అత్యంత కీలకమైన ప్రాంతాలను గుర్తించి, బడ్జెట్‌ను సరైన రీతిలో కేటాయించడం ద్వారా అనవసరపు ఖర్చులను నివారిస్తారు.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసేందుకు వర్షపు తోటలు, బయోస్వేల్స్ వంటి పర్యావరణ అనుకూల నిర్మాణాలను ప్రోత్సహిస్తారు. ఈ మాస్టర్ ప్లాన్‌ను అత్యంత శాస్త్రీయంగా, ఆధునిక టెక్నాలజీతో రూపొందించనున్నారు. వర్షపాతం, నాలాల ప్రవాహం, భూభాగం వంటి డేటాను సాంకేతికతలతో సేకరిస్తారు. ప్రస్తుత, 2047 నాటి పరిస్థితులను అంచనా వేస్తూ హైడ్రాలిక్ నమూనాలను అభివృద్ధి చేసి, వరద ప్రమాద తీవ్రతను లెక్కిస్తారు.
నగరంలోని ప్రతి నాలాను, మ్యాన్‌హోల్‌ను జియో-రిఫరెన్సింగ్‌తో డిజిటల్ మ్యాప్‌గా రూపొందిస్తారు. సెన్సార్లు, రాడార్ల సహాయంతో రియల్ టైంలో వర్షపాతాన్ని, వరద తీవ్రతను అంచనా వేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను ప్రతిపాదిస్తారు. ఈ బృహత్ కార్యాన్ని చేపట్టేందుకు అర్హత, అనుభవం ఉన్న కన్సల్టెంట్లు, సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆహ్వానించాలని జీహెఎంసీని ప్రభుత్వం ఆదేశించింది.