10-08-2025 01:22:15 AM
- ప్రధాన రోడ్లపై భారీగా రద్దీ
- కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- ప్రయాణికులకు తప్పని అవస్థలు
- బస్టాండుల్లో కిక్కిరిసిన జనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాఖీ పండుగ వేళ హైదరాబాద్ మహానగరం జనసంద్రంగా మారింది. పండుగకుతోడు వారాంతం కూడా కలిసి రావడంతో సోదరులకు రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు వెళ్లే అక్కాచెల్లెళ్లు, నగరవాసుల రాకపోకలతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బస్టాండ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్- మార్గంలో ఏకంగా ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. జేబీఎస్ నుంచి ఓఆర్‌ఆర్ చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. ఎల్బీ నగర్, ఉప్పల్, బోయిన్‌పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్‌పేట్ వంటి అన్ని ప్రధాన కూడళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇక నగర శివార్లకు దారితీసే జాతీయ రహదారులపైనా ఇదే పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ రహదారిపై వాహనాలు తాబేలు నడకను తలపించాయి. వనస్థలిపురం, భాగ్యలత, ఆర్టీసీ కాలనీ, హయత్‌గర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
హయత్‌నగర్ బస్టాండ్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనాల కదలికలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి అన్నోజిగూడ, ఘట్కేసర్ వరకు వాహనాలు బారులు తీరాయి. కేవలం అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ చేరుకోవడానికే దాదాపు 50 నిమిషాల సమయం పట్టింది.
బస్టాండ్లలోనూ తప్పని తిప్పలు
తెలంగాణ ఆర్టీసీ ‘రాఖీ స్పెషల్’ పేరుతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల రద్దీకి అవి సరిపోలేదు. జూబ్లీ బస్ స్టేషన్, ఇతర బస్టాండ్లు మహిళలతో కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రిజర్వేషన్లు ముందుగానే పూర్తవడంతో, నేరుగా బస్టాండ్లకు వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. చాలా బస్సుల్లో సీట్లు నిండిపోవడంతో ప్రయాణికులు నిల్చునే ప్రయాణం చేయాల్సి వచ్చింది.