26-08-2025 02:54:04 AM
-స్థానిక ఎన్నికలలోగా వారి సమస్యలు పరిష్కరించాలి
-లేదంటే అసెంబ్లీని స్తంభింపజేస్తాం
-బీఆర్‌ఎస్ చేపట్టిన పనులకు సీఎం రేవంత్ రిబ్బన్ కట్
-ఆశా వర్కర్ల మహా ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు
ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): 50 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆశా కార్యకర్తలతో చర్చింఇ, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం (బీఆర్‌టీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో హరీశ్‌రావు మాట్లాడారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు గోదావరి కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసి మోరీల్లో పోస్తా అని సీఎం రేవంత్ అంటున్నాడని, అందుకు రూ.6000 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని చెప్తున్నారని అన్నారు.
హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌లో రూ.4000 కోట్లతో ఎస్టీపీలను రేవంత్‌రెడ్డి ఖర్చు పెడుతున్నాడని, కమీషన్లు, కాంట్రాక్టుల కోసం హెచ్‌ఎండిఏ పదివేల కోట్లతో టెండర్లు పిలిచారని విమర్శించారు. జిహెచ్‌ఎంసి లో 6000 కోట్లతో టెండర్లు పిలిచారని, ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారన్నారు. ఇంత ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఆశాలకు, అంగన్‌వాడీలకు జీతాలు ఇచ్చేంత డబ్బులు లేవా అని నిలదీశారు.
రేవంత్‌రెడ్డికి ఎన్నికలప్పుడు సంపాదన పెంచుడు తెలుసు, పంచుడు తెలుసు అని, ఆయన కుటుంబ సభ్యులు దంచుకొనుడు తప్ప పేదలకు పెట్టే సోయి లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం శానిటేషన్ డబ్బులు కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదని అన్నారు.
గ్రామపంచాయతీలో ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదన్నారు. గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెత్త సేకరణ, బ్లీచింగ్ పౌడర్ లేక, గ్రామాలు నిర్వీరమైపోయాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే విద్యార్థులను మూడు రోజుల ముందే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
నిర్బంధాల మధ్య యూనివర్సిటీని ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రారంభించిన పనులకు రేవంత్‌రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ రిబ్బన్లు కట్ చేస్తున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్‌రెడ్డి ప్రజలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. దమ్ముంటే గన్‌మన్లు లేకుండా, పోలీసులు లేకుండా యూనివర్సిటీకి వంత్ రెడ్డి రావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు బిల్లులు లేదని, అన్నం పెట్టిన కార్మికులకు 6 నెలల జీతాలు లేవన్నారు. కాంగ్రెస్ క్యాబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా మహిళలయిన ఆశాలు, అంగన్వాడీలు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. అవసరమైతే అసెంబ్లీని స్తంభింప చేసి ఆశాల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు.