26-08-2025 02:52:38 AM
గౌతమి డిగ్రీ కాలేజీ, సుల్తాన్ ఉల్ ఉలూం ఫార్మసీ కాలేజీలపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
28న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటంపై తెలంగాణ హెచ్‌ఆర్‌సీ స్పందించింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్‌లను అన్యాయంగా నిలుపుదల చేసిన రెండు కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు గౌతమి డిగ్రీ కాలేజీ, సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కాలర్‌షిప్, ఫీజు రీయెంబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందనే సాకుతో బాలానగర్‌లోని గౌతమి డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఒక బీబీఏ పట్టభద్రుడి సర్టిఫికెట్లు, టీసీను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాగే బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఫార్మసీ కాలేజీ ఈనెల 21న హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని పది మంది విద్యార్థులు కమిషన్ దృష్టికి తీసుకురావడంతో విచారించిన కమిషన్ ఈనెల 28న కమిషన్ ముందుకు హాజరుకావాలని రెండు కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లను నిలిపివేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.