13-08-2025 10:33:43 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Congress Party In-charge Dr. Kota Neelima) బుధవారం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా సనత్ నగర్ లో ప్రభుత్వం నుంచి మంజూరైన సబ్సిడీ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలను ఆర్థికంగా నిలబెట్టడం కోసమే ప్రభుత్వం సబ్సిడీతో ఆటోలు పంపిణీ చేస్తోందన్నారు. మంజూరైన ఆటోలతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి ఉంటుందన్నారు. మరోవైపు సనత్ నగర్, అమీర్ పేట్, బన్సీలాల్ పేట్ ప్రాంతాల్లో చిరువ్యాపారమే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులకు ఎండకు, వానకు రక్షణగా ఉచితంగా గొడుగులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో చిరు వ్యాపారులు తమతమ వ్యాపారాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురుకొంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందులో భాగంగా వారివారి వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా గొడుగులు పంపిణీ చేశామన్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో రోడ్డు పక్కన, కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఉపశమనం పొందేందుకు తమ వంతుగా గొడుగులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రోజంతా ఎండనక, వాననక చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలు, వృద్ధులకు నీడనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్లలోని నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.