13-08-2025 10:29:21 PM
ఇందిరా మహిళ శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
గంభీరావుపేట (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు వ్యాపారంలోనూ రాణించాలని, స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆకాంక్షించారు. ఇందిరా మహిళా కింద గంభీరావుపేటలో శ్రీ మణికంఠ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు & విత్తనాలు దుకాణాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రథమమని వెల్లడించారు. మహిళా సంఘాల బాధ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం రైతులకు ఎరువుల పంపిణీని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. అనవసర ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సూచించారు. జిల్లాకు సరిపడా యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిషెట్టి విజయ, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, తహశీల్దార్ మారుతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.