13-08-2025 11:01:19 PM
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి...
కోదాడ: భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy)లు అధికారులను ఆదేశించారు. రెండు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు, చెరువులు పూర్తిగా నిండిపోవడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, శిధిలమైన భవనాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చూడాలన్నారు. విద్యుత్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లు మోటార్ల వద్ద రైతులు జాగ్రత్త వహించాలని ఏమైనా అనుకోని సంఘటనలు ఎదురైతే వెంటనే సంబంధిత మండల జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులకు పోలీసులకు 100 నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. వాగులు వంకలు చెరువులు దాటేటప్పుడు వాహనదారులు, పాదాచార్యులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పిల్లలను బయటకు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని తప్పనిసరి అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను కోరారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.