20-08-2025 01:38:31 AM
రైతులకు సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 19: కూలీల కొరత ఉన్నందున్న డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష హాజరయ్యారు.
వర్షకాలంలో రైతులు పాటించాల్సిన సూచనలుసలహాలపై రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాత మామిడి తోటల పునర్ జీవనం- వాతావరణ బులిటెన్ డిజిటల్ వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, అనే అంశాలపైన రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ప్రస్తుత సమయంలో కూలీల కొరత ఉన్నందున రైతులు డ్రోన్ టెక్నాలజీ ద్వారా వివిధ పంటలకు వచ్చే తెగుళ్లకు పురుగులకు మందు (పిచికారి) చేయుటకు డ్రోన్ స్ప్రేలను వినియోగించుకోవాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలను స్ప్రే ద్వారా పురుగు మందులను పిచికారి చేసుకోవచ్చని తెలిపారు.
అలాగే పాత మామిడి తోటలలో కొమ్మలు కత్తిరించడం వలన కొత్త కొమ్మలు వచ్చి వాటి ద్వారా పూత ఎక్కువ వస్తుందని.. దీంతో అధిక దిగుబడి వచ్చి.. రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. ఈ కొమ్మలు కత్తిరించడానికి ఆగస్టు మాసమే సరైన సమయమని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐ. పల్లవి వ్యవసాయ విస్తరణాధికారి ఎన్. రఘు, వివిధ గ్రామాల రైతులుపాల్గొన్నారు.