24-07-2025 01:23:04 AM
హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందాలపై నార్కోటిక్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని దాడులు చేసి నా, రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్న డ్రగ్స్ ముఠాలపై పోలీసులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం నార్కోటిక్స్ వింగ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది.
హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ ముఠాలతో పాటు ముంబైతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులను నార్కోటిక్స్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్, ఎఫిడ్రిన్, మియావ్ మియావ్ డ్రగ్ సరఫరా చేస్తున్న మొత్తం 9 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు కొకైన్ సరఫరాదారులు కాగా, మరో ముగ్గురు మియావ్ మియావ్ ఎండీ డ్రగ్ సరఫరాదారులు.
నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్సటసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా, ఒక కంట్రీ మేడ్ తుపాకీతో పాటు ఆరు రౌండ్ల లైవ్ బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దాడుల్లో డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న మరో ఇద్దరు నైజీరియన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వీరిని స్వదే శాలకు డిపోర్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
మూడు ముఠాలు
ఈ డ్రగ్స్ ముఠాల అరెస్టుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ముంబైతో సంబంధం ఉన్న మూడు వేర్వేరు ముఠాలను పట్టుకున్నారన్నారు. మొత్తం తొమ్మిది మంది పెడ్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లను అరెస్టు చేశామన్నారు. ఈ దాడిలో మొత్తం 300 గ్రాముల కొకైన్, 100 గ్రాముల మెఫాడ్రిన్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నామని అని సీపీ తెలిపారు.
వీటిలో మొదటి ముఠా కొకైన్ అమ్ముతుందన్నారు. గతంలో పట్టుబడిన రవి వర్మ, సచిన్‌ల విచారణలో ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే పెడ్లర్ పాత్ర వెలుగులోకి వచ్చిందన్నారు. 2022లో డ్రగ్స్ వాడకం మొదలుపెట్టిన ప్రేమ్, ముంబైకి చెందిన డ్రగ్ ముఠాలతో లింకులు ఏర్పరుచుకున్నాని తెలిపారు.
ముంబైకి చెందిన ముజా యిత్ అనే పెడ్లర్ నైజీరియన్ల నుంచి సము ద్ర మార్గం ద్వారా కొకైన్ తెప్పించి, తన సబ్-సప్లయర్స్ ద్వారా పెడ్లింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు ఎలక్ట్రీషియన్లను (చైతన్య, ఖాన్) సబ్-పెడ్లర్లుగా మార్చుకొని హైదరాబాద్‌లో సర ఫరా చేస్తున్నారని వివరించారు. ప్రేమ్ ఉపాధ్యాయ్ వీళ్ల దగ్గరి నుంచే డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్ముతున్నాడని చెప్పారు. ప్రేమ్ నుంచి 276 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశామని, దీని విలువ రూ.69 లక్షలు ఉంటుం దని సీపీ తెలిపారు.
మెఫాడ్రిన్ ముఠా..
మెఫాడ్రిన్ అమ్ముతున్న రెండో ముఠాలో పవన్ భాటి, హేమ సింగ్ కీలకంగా ఉన్నారన్నారు. కాటేదాన్‌కు చెందిన రాజస్థాన్ వాసి జితేందర్ చిన్న వయసులో హైదరాబాద్‌కు వచ్చి స్వీట్ షాప్ పెట్టి నష్టపోయాడని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ భాటి పరిచయం కావడంతో ఇద్దరూ డ్రగ్స్ అమ్మకమే మార్గంగా ఎంచుకుని 2022 నుండి డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిపారు.
సురేందర్, హనుమాన్ అనే రాజ స్థాన్‌కు చెందిన వారి నుంచి వీళ్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యాపారం ప్రమాదకరమైనది కాబట్టి ఆయు ధం అవసరమని భావించిన జితేందర్, పవన్ భాటితో కలిసి రూ. 75 వేలతో ఒక కంట్రీ మేడ్ గన్‌ను కొనుగోలు చేశాడని, కాటేదాన్‌లో ఒకసారి గన్‌తో ఫైరింగ్ కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టూ పెడ్లర్
పట్టుబడ్డ మూడవ ముఠా కొకైన్, ఎక్సటసీ పిల్స్ సరఫరా చేస్తోందని సీపీ తెలిపా రు. బొల్లారం పీఎస్ పరిధిలో పట్టుబడిన ఈ ముఠాలో హర్ష అనే నిందితుడు బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మోసం చేసిందని డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు.
హర్షకు గోవాకు చెందిన క్రిస్ అనే పెడ్లర్‌తో పరిచయం ఏర్పడింది. ముందుగా డ్రగ్స్ వినియోగదారుడి గా ఉన్న హర్ష, ఆ తర్వాత తానే పెడ్లర్‌గా మారి విక్రయించడం మొదలుపెట్టాడన్నా రు. హర్ష నుంచి 10 గ్రాముల కొకైన్, ఎక్సటసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
ఇద్దరు నైజీరియన్ల పాత్ర
హర్ష విచారణలో ఇద్దరు నైజీరియన్ల పాత్ర వెలుగు చూసిందన్నా రు. వీసా గడువు ముగిసినా కూడా వీరు ఇక్కడే ఉంటున్నారని, క్లెమెంట్ అనే నైజీరియన్ చీటింగ్ కేసులో చండీగఢ్‌లో అరెస్ట్ అయి, నాలుగు నగరాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో నైజీరియన్లను అరెస్ట్ చేసి జైలుకు పంపినా బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు.
ఎన్‌డీడబ్ల్యూ నాన్-బె యిలబుల్ వారెంట్ జారీ చేసినా దొరకడం లేదని, అం దుకే ఈ ఇద్దరినీ వారి దేశాలకు డిపోర్ట్ చేస్తామని సీపీ స్పష్టం చేశా రు. విదేశీయులను డిపోర్ట్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని అని, ఇది తమకు పని ష్మెంట్ లాంటిదని సీపీ పేర్కొన్నారు. డిపోర్ట్ చేయడానికి ఎమర్జె న్సీ ట్రావెల్ సర్టిఫికెట్ పొందా లని, అది పొందడం కష్టమని వివరించారు.
ట్రావెల్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎగ్జిట్ పర్మిషన్ ఇస్తుందని, అప్పుడు ఎయిర్ టికెట్ బుక్ చేయాల్సి ఉం టుందని, అప్పటి వరకు వారి బాధ్యత తమదేనని చెప్పారు. గత మూడేళ్లలో ఇప్పటివరకు 33 మం ది విదేశీయులు అరెస్ట్ అవ్వగా, 19 మందిని డిపోర్ట్ చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు.