12-12-2025 01:09:53 AM
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రశంస
మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించిన సీఎం
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ విజన్ డాక్యుమెంట్ -2047 ఆవిష్కరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపా రు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని తెలిపారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీని గురువారం ఢిల్లీలోని వారి నివాసాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ జరిగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై పార్టీ అగ్రనేతలు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. సీఎం వెంట మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్‌కుమార్, బలరాంనాయక్, డాక్టర్ మల్లు రవి, రఘవీర్‌రెరెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.
ఎలాంటి సంబంధమూ లేదు..
ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెస్సీ హాజరవుతున్నారని, ‘నేను సీఎంగా ఉన్నాను. కాబట్టి నన్ను కూడా ఆ సంస్థ ఒక అతిథిగా ఆహ్వానించింది’ అని ఆయన తెలిపారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ క్రీడాకారుడు హైదరా బాద్‌కు వస్తున్నందున ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నామన్నారు. మెస్సీగోడ్ ఇండియా టూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రి యాంక గాంధీని ఆహ్వానించినట్లు సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో కలిసిన అందరినీ ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు.
గోడ్ ఇండియా టూర్ 2025 పేరుతో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారని చెప్పారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించబోతున్నారని తెలిపారు. ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.
ఇలా ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.