calender_icon.png 12 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ ఎదుట లొంగిపోండి

12-12-2025 12:58:34 AM

సిట్ విచారణకు సహకరించండి 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం 

నేడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ సిట్ అధికారికి సరెండర్ కావాలని సూచన.. 

భౌతికంగా హాని కలిగించొద్దని అధికారులకు ఆదేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థకు సహకరించకుండా విదేశాల్లో ఉంటూ, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ నుంచి రక్షించే మధ్యంతర ఉత్తర్వులను కోర్టు ఎత్తివేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ సిట్ అధికారి ఎదుట లొంగిపోవాలని, సిట్ విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.

ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభాకర్‌రావు కస్టోడియల్ దర్యాప్తు చేపట్టాలని సిట్‌కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అయితే ప్రభాకర్‌రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని సిట్ అధికారులను ఆదేశించింది.

కాగా పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని కోర్టు చెప్పినా ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభాకర్‌రావు వినియోగించిన ఐఫోన్ ఐక్లౌడ్ పాస్‌వర్డులను రీసెట్ చేసి అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ఇదివరకే ఆదేశించింది.

అయినా కూడా కేవలం రెండు పాస్‌వర్డులను మాత్రమే రీసెట్ చేశారని, రీసెట్ చేసిన రెండు అకౌంట్లలోని సమాచారాన్ని ముందే డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. ‘కోర్టు పిటిషనర్‌ను మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు సహకరించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. దీనిపై మీరేమంటారు’ అని ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించారు.

దర్యాప్తునకు ప్రభాకర్‌రావు సహకరిస్తున్న విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని ఆయన చెప్పారు. ఆ అఫిడవిట్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాఖలు చేయడంతో పరిశీలించలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూద్రా బుధవారం జరిగిన విచారణ సందర్భంగా చెప్పారు. ఇరువైపులా వాదనల అనంతరం సిట్ అధికారి ఎదుట ప్రభాకర్‌రావు లొంగిపోవాలని సుప్రీంకోర్టుల ఆదేశాలు జారీ చేసింది.