calender_icon.png 16 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రీకరణకు సులభంగా అనుమతులు

16-09-2025 01:00:42 AM

- పూర్తి సమాచారంతో ప్రత్యేక వెబ్‌సైట్

- త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

- ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ర్టంలో సినిమాల చిత్రీకరణకు, సినిమా థియేటర్‌ల నిర్వహణకు, సినీ రంగాభివృద్ధికి కావాల్సిన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ రూపొందిస్తోందని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ వెబ్‌సైట్ ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’పై సోమవారం సంబంధిత శాఖలు, ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో ప్రత్యేక వర్క్-షాప్‌ను బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో నిర్వహించారు.

ఈ వర్క్ షాప్‌కు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేగింగ్ డైరెక్టర్ సీహెచ్ ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ర్ట చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. రాష్ర్టంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని రకాల చేయూతనిస్తున్నారని, ఈ సదావకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి సినిమా నిర్మాణానికి కావాల్సిన షూటింగ్ లొకేషన్లు, కావాల్సిన అనుమతులు, సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్లు, హైదరాబాద్‌తోపాటు రాష్ర్టంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న హోటళ్లతో కూడిన సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్‌సైట్ రూపొందిస్తున్నామని చెప్పారు. మొదటిసారిగా తెలంగాణలో మాత్రమే దీన్ని రూపొందిస్తున్నామన్నారు.

దీంతోపాటు సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్ జారీ విధానాన్ని కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా పొందే విధానాన్ని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు హోం శాఖతో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. ఈ వెబ్-సైట్ రూపకల్పనకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా చిత్ర పరిశ్ర ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను కోరారు. ఈ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో రూపొందించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.