24-08-2025 12:29:48 AM
- మేయర్ విజయలక్ష్మి
- జీహెఎంసీ సిబ్బందికి మట్టి విగ్రహాలు పంపిణీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): పర్యావరణ హితంగా వినాయక చవితిని వైభవంగా జరుపుకుందామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులనే ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. శనివారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌తో కలిసి ఉద్యోగులు, సిబ్బందికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పది రోజుల పాటు జరిగే వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా జరపడమే జీహెచ్‌ఎంసీ ముఖ్య ఉద్దేశం అన్నారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, అని తెలిపారు. 2 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్ తెలిపారు. శోభాయాత్రల సందర్భంగా పారిశు ద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఇందుకోసం 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టులలో విధులు నిర్వహిస్తారని ఆమె స్పష్టం చేశారు.