24-07-2025 01:09:01 AM
ఆగస్టు 11న విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టిం చిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాకు మరోసారి నోటీసు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని తాజా నోటీసులో ఆదేశించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారించేందుకు ఈడీ గతంలోనే ఒక షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఈ మేరకు దగ్గుపాటి రానాతో పాటు ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు జూలై 21న సమన్లు జారీ చేసింది. మొదటగా జూలై 23న రానా దగ్గుబాటి, జూలై 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వ్యక్తిగత కారణాల వల్ల జూలై 23న విచారణకు హాజరు కాలేనని, కొంత సమయం కావాలని రానా ఈడీని అభ్యర్థించారు.
రానా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ, ఆయనకు ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని కొత్త తేదీని కేటాయించింది. ఈ సారైనా రానా విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారిం ది. ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మిలపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.