30-07-2024 12:50:05 AM
బడుల్లో టాయిలెట్స్ కూడా నిర్మించలేకపోయారు
గత బీఆర్‌ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం ఫైర్
హైదరాబాద్, జూలై 29( విజయక్రాంతి): పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ కూడా నిర్మించలేకపోయారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. గురుకులాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి సొంత భవనాలు కట్టించలేదని మండిపడ్డారు. పదేళ్లలో టీచర్ల నియామకాలు కూడా చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోందన్నారు. టీచర్లతో పాటు అటెండర్, స్కావెంజర్లను కూడా భర్తీ చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ‘ఈక్వాలిటి జస్టిస్’ లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని.. వెనుకబడిన పాలమూరు, ఆదిలాబాద్, భద్రాచలం జిల్లాలను ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. వీసీల నియామకాల్లో తమ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు.