calender_icon.png 2 May, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోనే భావితరాలకు బంగారుబాట

10-04-2025 07:07:33 PM

వనవాసీ గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్..

చర్ల (విజయక్రాంతి): విద్యతోనే భవిష్యత్ తరాలకు బంగారుబాట పడుతుందని వనవాసీ కల్యాణ పరిషత్ గౌరవ సలహాదారులు, విశ్రాంత ప్రదానోపాద్యాయులు బివిఎస్ఎల్ నరసింహారావు అన్నారు. చర్లకు చెందిన ప్రముఖ బంగారం వ్యాపారి గాదంశెట్టి నర్సింహారావు, తన తండ్రి గాదంశెట్టి బాల నర్సింహం వర్దంతి సందర్భంగా చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు వితరణ అందచేసారు. గురువారం  స్దానిక కొమరం భీం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో నర్సింహారావు కుటుంబ సభ్యులు 50 కేజీల బియ్యం, విద్యార్థులకు భోజన ఏర్పాట్లు, మిఠాయిలు, పండ్లను అందచేసారు.

ఈ సందర్భంగా బివిఎస్ఎల్ నర్సింహారావు మాట్లాడుతూ... పేద విద్యార్దుల చదువులను దాతలు చేస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. వనవాసీ విద్యార్ది నిలయాలకు ప్రభుత్వం, కార్పోరేట్ శక్తుల నుండి భారీగా విరాళాలు రావని, ఒకవేళ అటువంటి వారు ఇచ్చినా సంస్ద తీసుకోదని వెల్లడించారు. కేవలం స్దానికంగా దాతల సహకారంతోనే సంస్ద నిర్వహణకు ఉపయోగిస్తామని స్పష్టం చేసారు. చర్ల మండల ప్రజలు ఎంతో దాణగుణం గలవారని ప్రశంసించారు. విద్యార్దుల ఉన్నతిలో స్దానిక దాతలు సహకారం అందించడం అబినందనీయమన్నారు. గాదంశెట్టి కుటుంబం సంస్దకు ఎంతగానో సహకరిస్తోందని సంతోషం వ్యక్తం చేసారు.

విద్యార్దులు సైతం దాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒక్క తరం చదివి ఉద్యోగంలో స్దిర పడితే భావితరాలు సైతం ఉన్నతులుగా ఉంటారని పేర్కొన్నారు. అందుకే ప్రతి విద్యార్ది కష్డపడి చదవాలని విజ్ఞప్తి చేసారు. విద్యార్దులకు వితరణ అందించిన గాదంశెట్టి నర్సింహారావు కుటుంబానికి నిలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, నిలయ కమిటీ ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.