calender_icon.png 2 September, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

02-09-2025 04:07:42 PM

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

మంచిర్యాల, (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాగం శ్రీకాంత్, ఈదునూరి అభినవ్ లు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఏడేండ్ల నుంచి రూ. 8,641 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, నూతన విద్య విధానాన్ని రాష్టంలో అమలు చేయకుండా అసెంబ్లీ లో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్ధుల ఫీజులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు వాపోయారు. ఇప్పటి వరకు కనీసం విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కనీసం ఒక్క చర్చ కూడా చేయడం లేదని, పెండింగ్ ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలనీ కోరారు. ప్రభుత్వం తొమ్మిది నెలలుగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయడం లేదని, గురుకులాలలో యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని, యూనివర్శీటీల సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ఫీజులను వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు వచ్చి విద్యార్థులు వసతిగృహాలు, గురుకులాలు, కెజిబివిల్లో లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు.  వచ్చే అకాడమీక్ లో నూతన విద్యా విధానాన్ని తీసుకు రాబోతుందని, దీని వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. విద్యా వ్యవస్థ ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకీ వెళ్లి అడ్డగోలుగా ఫీజుల వసూళ్లకు పాల్పడతారని, దీనిని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో నూతన విద్యా విధానన్ని అమలు చేయకుండా తీర్మాణం చేయాలని, లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నిఖిల్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ రత్నవేణి, జిల్లా కమిటి సభ్యులు భారత్, రాంచరణ్, రామకృష్ణ, హర్షవర్ధన్, ప్రదీప్, ప్రతీక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.