12-09-2025 12:00:00 AM
-విద్య, వైద్య రంగాల్లో మార్పు తీసుకొస్తాం
-మంథని బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, సెప్టెంబర్ -11 (విజయక్రాంతి)/ముత్తారం: మంథని నియోజకవర్గంలో విద్యారంగాభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం నియోజకవర్గంలో శ్రీధర్‌బాబు విస్తృతంగా పర్యటించారు. మంథని మున్సిపాలిటీలో రూ. 80 లక్షలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలో ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందాలని స్వచ్ఛంద సంస్థ టీ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.విద్య, వైద్య రంగాల్లో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుం దని అన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుతో పాటు పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో టీ ఫర్ చేంజ్ కీలక పాత్ర పోషిస్తుందని, సమాజంలో మంచి జరగాలని నిస్వార్ధంగా కృషి చేస్తున్న మంచు లక్ష్మికి అభినందనలు తెలిపారు.విద్యా రంగంలో అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ సహకారం అందించడం సంతోషకరమని మంత్రి అన్నారు. మంథని నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పటు చేస్తూ పిల్లలకు మెరుగైన బోధన అందించేందుకు సహకారం అంది స్తున్న టీ ఫర్ చేంజ్ సంస్థ స్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందన్నారు. టీ ఫర్ చేంజ్ సంస్థ ప్రతినిధులు, ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ మంథనిలో ఆరు తరగతి గదులను డిజిటలైజ్ చేశామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధి లో మొత్తం మా సంస్థ ద్వారా 51 తరగతి గదుల్లో డిజిటల్ సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
మంచి నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో టీ ఫర్ చేంజ్ సం స్థ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ , మంథని రామగిరి కమాన్ పూర్ మండలంలో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, డీఈవో డి.మాధవి, మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న,ఆర్డీవో సురేష్, సహకార సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
అడవి శ్రీరాంపూర్‌లో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
ముత్తారం మండలంఅడవి శ్రీరాంపూర్ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎల్‌ఎంఎస్ పుస్తకాల పంపిణీ, టి ఫైబ ర్ ద్వారా గ్రామానికి ఏర్పాటుచేసిన సీసీటీవీని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడవి శ్రీరాంపూర్ లో ప్రతి ఇంటికి టి ఫైబర్ కనెక్షన్ అందించినట్టు తెలిపారు.
ఏఐ ల్యాబ్ ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రభు త్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయాలని, దీని కోసం సీఎస్‌ఆర్ నిధులు వినియోగిస్తామన్నారు. ముత్తారం మండలంలోని దర్యాప్పూర్ వద్ద రూ.2.80 కోట్లతో, పోతారంలో రూ.౨.20 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్ పనుల కు శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. ముత్తారం తాసిల్దార్ కార్యాలయంలో 18 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.