24-12-2025 12:18:13 AM
దుబాయి, డిసెంబర్ 23 : భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది. తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రాణిస్తున్న దీప్తి ఆస్ట్రేలియా క్రికెటర్ అన్నాబెల్‌ను అధిగమించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. దీప్తి 737 రేయింట్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, అన్నాబెల్ 736 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దీప్తి శర్మ ఇప్పటి వరకూ 130 టీ ట్వంటీల్లో 148 వికెట్లు, 1100 పరుగులు చేసింది.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మూడో ర్యాంకులోనూ, జెమీమా రోడ్రిగ్స్ 9, షెఫాలీ వర్మ 10వ ర్యాంకులోనూ కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానకు చుక్కెదురైంది. తాజా జాబితాలో టాప్ ప్లేస్ నుంచి రెండో ప్లేస్‌కు దిగజారింది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్ట్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే మహిళల టీమ్ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ వరుసగా మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.