calender_icon.png 7 November, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి

07-11-2025 12:03:34 AM

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, నవంబర్  6 (విజయ క్రాంతి) : నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ గురువారం సమీక్ష జరిపారు. ఇదివరకటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు.

ఖాళీ స్థలాల పరిరక్షణ, వన మహోత్సవం, నాటిన మొక్కలను సమర్ధవంతంగా కాపాడటం, పారిశుధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై సాధించిన పురోగతిని సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒక్కో డివిజన్ వారీగా పై అంశాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. వార్డు ఆఫీసర్లకు వారివారి డివిజన్లలో నెలకొని ఉన్న పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

అప్పుడే వారు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయగలరని అన్నారు.  ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి వార్డు అధికారులు అంకిత పని చేయాలని అన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి, వాటి పరిరక్షణ కోసం కంచె ఏర్పాటు చేయాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిరిగా మొక్కలు నాటించాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.

పట్టణ ప్రకృతి వనాలు, మీడియన్, అవెన్యూ ప్లాంటేషన్ల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలని, ప్రతి మొక్క సంరక్షించబడేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి రోజు చెత్త సేకరణ ఆటో ట్రాలీలు ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. 

అవకాశం ఉన్న చోట డ్రైనేజీలను శుభ్రపరచేందుకు జె.సీ.బీలను వినియోగించాలని సూచించారు. చెడిపోయిన యంత్రాలు, స్వీపింగ్ వెహికల్ వంటి వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించి వినియోగం లోకి తేవాలన్నారు. అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి నివాస ప్రాంతంలో పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా చొరవ చూపాలని అన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని అన్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న వారు కూడా జీ+1 పద్ధతిలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, మంజూరీలు పొందిన లబ్ధిదారులు అందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు..

అర్హులైన కొత్త లబ్దిదారులను గుర్తించి ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డీ.ఈ నివర్తి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, అధికారులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.