11-08-2025 07:21:04 PM
భద్రాచలం (విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని పాఠశాలల్లోని చిన్నారులకు, 01 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని నన్నపనేని జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు మాత్రలు వేసుకునేలా వైద్యశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధిమాంద్యత, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు.
విద్యాశాఖ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసి ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలను అందివ్వాలి అన్నారు. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు అందించాలన్నారు. పిల్లలు భోజనం చేసిన తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు వారి పరిధిలోని గ్రామాలలోనీ ప్రజలకు, పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు కడుపులో నులిపురుగులు పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని, విద్యార్థినీ విద్యార్థులు గోర్లు శుభ్రంగా ఉండేలా చూసుకొని చిన్నవిగా పెంచుకోవాలని, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉన్న మంచినీటిని తాగాలని, బజార్లలో దొరికే తినుబండారాల జోలికి వెళ్లకూడదని, మనము తినే ఆహార పదార్థాలపై ఎప్పుడు మూతలు పెట్టి ఉంచాలని, పండ్లు, కూరగాయలు శుభ్రమైన నీటితో కడగాలని, భోజనం చేసేముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుకోవాలని, బహిరంగంగా మలవిసర్జన చేయకూడదని, బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు పిల్లలకు తెలియజేయాలని అన్నారు.
ఈరోజు 11వ తేదీన మాత్రలు తీసుకొని వారికి 18వ తేదీన మాప్ ఆఫ్ డే నిర్వహించి మాత్రలు అందించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులకు కూడా మాత్రలు అందేలా చూడాలని అన్నారు. అనంతరం చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి ఎప్పుడు పరిశుభ్రతను పాటించాలని చిన్నారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు వైద్య శాఖ అధికారి డాక్టర్ సైదులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.