calender_icon.png 12 August, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ రహదారి కష్టాలు తీర్చండి

11-08-2025 11:20:17 PM

మంత్రి కోమటిరెడ్డిని కోరిన వజ్రెష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి..

మేడిపల్లి: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు చేపట్టిన ఫ్లై ఓవర్ పనుల వల్ల ఉప్పల్ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని, ప్రభుత్వం ఈ రహదారికి మరమ్మతులు నిర్వహించి ప్రజల కష్టాలు తీర్చాలని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ని కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రిని కలిసిన నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల వల్ల ఉప్పల్ ప్రాంతంలో రహదారి కష్టాలు తీవ్రంగా మారాయని, ఫ్లై ఓవర్ పనులు నత్త నడకన సాగడం వల్ల, ఈ ప్రాంతంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి తెలిపారు. ఫ్లై ఓవర్ పనులతో సంబంధం లేకుండా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి వరకు ఉన్న రహదారిని అభివృద్ధి పరచాలని కోరారు. అవసరమైతే ఈ రహదారికి ప్రత్యేక నిధులను మంజూరు చేయడంతో పాటు రహదారి నిర్వహణ జిహెచ్ఎంసి పరిధిలోకి తేవాలని కోరారు. తమ విన్నపంతో స్పందించిన మంత్రి ఉప్పల్ నారపల్లి రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారని, ఫ్లై ఓవర్ పనులను వేగవంతంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వంతో సైతం మాట్లాడుతానని భరోసా ఇచ్చినట్లు వజ్రేష్ యాదవ్ తెలిపారు.