11-08-2025 10:46:43 PM
చేతివాటం ప్రదర్శించిన కల్వకుర్తి పోలీస్..
ఏసీబీ దాడుల నుండి నేర్వని గుణపాఠం..
కల్వకుర్తి: విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం నుండి తప్పించిన లారీ డ్రైవర్ కు కల్వకుర్తి పోలీసులు పెనాల్టీ విధించారు. తనకు ప్రమాదం జరుగుతుందని తెలిసినా 18 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సును కాపాడబోయిన లారీ డ్రైవర్ నుండి కల్వకుర్తి పోలీసులు చేతివాటం ప్రదర్శించి వెయ్యి వసూలు చేశారు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణానికి చెందిన బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ మినీ బస్ 18 మంది చిన్నారులతో హైదరబాద్ చౌరస్తా నుంచి సిల్వర్ జూబ్లి క్లబ్ గుండా వెలుతోంది. ప్రధాన రహదారి నుండి మూలమలుపు వద్ద బస్సు ముందువైపు ఓ బొలెరో వాహనం నిలిపి ఉంచడంతో స్కూల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. అదే సమయంలో బళ్ళారి నుంచి హుజూర్ నగర్ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించాడు.
ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులంతా ఆహాకారాలతో శబ్దం చేయడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు తుఫాన్ డ్రైవర్, ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్లకు చివాట్లు పెట్టి పంపించారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీస్ లారీ డ్రైవర్ ను ఇబ్బందులకు గురిచేసి కేసు నమోదు కాకుండా ఉండాలంటే రెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర అంత లేదని చెప్పడంతో వెయ్యి రూపాయలు ఇవ్వాలని లేదంటే కేసు నమోదు చేస్తామంటూ బెదిరించడంతో తన ఫోన్ పే ద్వారా డబ్బులు ఇవ్వక తప్పలేదని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండు నెలల క్రితం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ పోలీసులు జనాల నుండి డబ్బులు వసూలు చేసే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే చాలు సామాన్యుల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.