27-09-2025 08:55:41 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): పోటీ ప్రపంచంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికతకు అనుగుణంగా వృత్తి విద్య కోర్సులు అందించేందుకు ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా కిజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ వై.రమేష్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో మంచిర్యాల, నస్పూర్, జన్నారం, మందమర్రి ప్రాంతాలలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులోని సీట్లను 100 శాతం అడ్మిషన్లు పూర్తి చేసి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో రోబోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక రంగాలకు సంబంధించి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ఈ క్రమంలో రానున్న కాలానికి అనుగుణంగా వృత్తి విద్య కోర్సులను అందించి యువతకు ఉపాధి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మ్యాన్ పవర్ పెంపొందించడం జరుగుతుందని, అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఐ.టి.ఐ., డిప్లొమా కోర్సులను అధునాతనంగా అభివృద్ధి చేసి అందించడం జరుగుతుందని, 2047 నాటికి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సర్వీస్ సెక్టార్, ప్రోడక్టివిటీ, ఉద్యోగాలు, ఉపాధి దిశగా ఇంజనీరింగ్, టెక్నికల్ సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న రంగాలలో ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైన సేవలు అందించేందుకు అధునాతన సాంకేతికతతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపాదిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.