28-01-2026 12:45:09 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల/లక్షెట్టిపేట టౌన్, జనవరి 27 (విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను ఎన్నికల నిబంధనలకు లోబడి పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, నామినేషన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు.
అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో చేపట్టిన పోస్ట్ మార్టం కేంద్రం నిర్మాణ పనులను తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారి కోటేశ్వర్‌తో కలిసి పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, తహశీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.