calender_icon.png 8 October, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

08-10-2025 12:13:58 AM

అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాహుల్ శర్మ

స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన 

కాటారం, అక్టోబర్ 7, (విజయక్రాంతి) :  స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఆయన ఆకస్మికంగా కాటారంలో పర్యటించారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో  స్ట్రాంగ్ రూము, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను  పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల  భద్రత, సీసీ కెమెరా, పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు, లెక్కింపు గదులలో విద్యుత్, లైటింగ్,  భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎంపిడివోలు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధ్రువీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.  దివ్యాంగులకు ర్యాంపు, మూడు చక్రాల సైకిళ్ళు అందుబాటులో ఉంచేలా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,  ఎంపిడిఓ బాబు, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

యువత ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శి ఏటీసీ 

కలెక్టర్ రాహుల్ శర్మ 

కాటారం, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : యువత ఉజ్వల భవిష్యత్తుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏ టి సి) లు మార్గదర్శిగా పనిచేస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించి బంగారు భవిష్యత్తుకు మార్గాలు వేసే అధునాతన సాంకేతిక కేంద్రంలో సత్వరమే యంత్రాలు, తరగతి గదులు  పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని  ఏటిసి ప్రిన్సిపాల్ ను, అధ్యాపకులను ఆదేశించారు.

మంగళవారం కాటారం మండలంలోని ఏటీసీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాబ్లలో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. పరికరాలు సకాలంలో అమర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే పరికరాల ఏర్పాటు విషయంలో ఏర్పడిన సమస్యలను తన దృష్టికి తీసుకురాకపోవడంపై ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. విద్యార్థుల శిక్షణకు అవసరమైన అన్ని పరికరాల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు.

కేంద్రం నిర్వహణలో పారదర్శకత, సమర్థత పాటించాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని హెచ్చరించారు. విద్యార్థుల  శిక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,  తహసిల్దార్ నాగరాజు,  ఎంపీడీవో బాబు, ప్రిన్సిపల్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.