calender_icon.png 22 May, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడుముళ్ల బంధానికి విద్యుదా‘ఘాతం’!

21-05-2025 12:52:30 AM

  1. కరెంట్ షాక్‌తో వరుడు దుర్మరణం

కాపాడబోయిన వధువుకు తీవ్ర గాయాలు 

మహబూబాబాద్ జిల్లా కోడిపుంజుల తండాలో విషాదం

మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): మూడుముళ్ల బంధంతో ఒక్కటై 48 గంటలు కూడా గడవకముందే నవ దంపతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వరుడు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడ్డ వధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో మంగళవారం ఉదయం జరిగింది. కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ వివాహం విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న విజయవాడలో జరిగింది.

కోడిపుంజుల తండాలో మంగళవారం విందు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ మోటార్ వైర్లు సరిచేస్తున్న నరేశ్ విద్యుత్‌ఘాతానికి గురయ్యాడు. తన భర్తను కాపాడేందుకు జాహ్నవి ప్రయత్నించగా ఆమె కూడా షాక్‌కు గురైంది. గమనించిన బంధువులు వెంటనే విద్యుత్ సరఫరాను తొలగించి అపస్మారక స్థితిలోకి చేరుకున్న నరేశ్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

అయినప్పటికీ నరేశ్ స్పృహలోకి రాకపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడ్డ జాహ్నవి మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన బంధుమిత్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడుముళ్ల బంధంతో పసుపు పారాణి ఆరకముందే వరుడు దుర్మరణం పాలవడం, వధువు గాయపడి ఆస్పత్రి పాలవడంతో కోడిపుంజుల తండా విషాదంలో మునిగిపోయింది.