calender_icon.png 22 May, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడగొట్టు వానలు!

22-05-2025 12:48:13 AM

  1. పలు జిల్లాల్లో ఈదురుగాలులు
  2. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం.. రైతుల తిప్పలు 
  3. విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
  4. పిడుగుపాటుకు ముగ్గురు మృతి
  5. అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

విజయక్రాంతి నెట్‌వర్క్, మే 21 : వాతావరణ కేంద్రం అంచనా వేసినట్టుగానే బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలు లు, మెరుపులతో కూడిన వానలు పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. పలు కేంద్రాల్లో తడిసి ముద్ద యింది. పలు ప్రాంతాల్లో వరిచేలు దెబ్బతిన్నా యి. పలుచోట్ల విద్యుత్‌స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి.

మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పాటుకు గురై ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఒక రు దుర్మరణం చెందారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాలు పలు జిల్లాల్లో జోరువాన కురిసింది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కామారెడ్డి జిల్లాలో 139 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిర్మల్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం రైతులకు తీవ్ర రాష్ట్రాన్ని కలిగించింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో బడుగుల లక్ష్మణ్‌కు చెందిన 34 మేకలు పిడుగుపాటుతో మృతి చెందాయి. భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరంలో వాన కురవడంతో భక్తులు ఇబ్బందులుపడ్డారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి 

మహబూబాబాద్ జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు దుర్మరణం చెందారు. గూడూ రు మండలం గుండెంగా గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్‌కుమార్(27) బహిర్భూమికి వెళ్లగా వర్షం పడుతుండటంతో చెట్టు కిందకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పిడుగు పడటంతో మృతిచెందాడు. కొత్తగూడా మండలం ఓటాయి గ్రామంలో గొర్రెల కాపరి దేశ బోయిన చేరాలు(55) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. 

వర్షాలు పడుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండాలి:సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు రాష్ర్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనలకు అనుగుణం గా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎప్పటిక ప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

వచ్చే ఐదురోజులూ వానలే..

  1. ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు 
  2. హైదరాబాద్‌లో జోరుగా వాన

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కర్ణాటక, -గోవా తీరాల వెంట తూర్పు, మధ్య అరేబియా సముద్రంపైనున్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తాంధ్రా వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ.ల వరకు విస్తరించి ఉన్నదని వాతావారణ కేంద్రం పేర్కొన్నది.

ఏపీ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1. కి.మీ.లు విస్తరించి ఉన్నదని అంచనా వేసింది. గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వానలు పడనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

శుక్ర, శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా (3నుంచి5 డిగ్రీలు) తగ్గే అవకాశం ఉంది. 

హైదరాబాద్‌లో వాన

కాగా హైదరాబాద్‌లోని పలుచోట్ల బుధవారం ఉదయం నుంచి సాయంత్ర వరకు జోరు వర్షం కురిసింది. మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, బేగంపేట, అల్వాల్, సైదాబాద్, సంతోష్‌నగర్, చాదర్ ఘాట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, లక్డీకపూల్, అంబర్‌పేట, ఉప్పల్‌లో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది.