31-07-2025 11:31:32 PM
గజ్వేల్: పరిశ్రమలకు భూములు ఇచ్చిన తమకు కేటాయించిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని, సాగు చేస్తున్న పంటలకు కరెంటు ఇవ్వాలంటూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోని పల్లి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. టిజిఐసికి అప్పగించిన భూముల్లో పరిశ్రమలు లేకపోవడంతో వానాకాలం పంటలు వేసుకున్నామని, అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కరెంటు కనెక్షన్లు తొలగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయినందుకు తమకు ప్లాట్లు కూడా ఇచ్చారని వాటిని ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నారు.
రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులకు రూరల్ సిఐ మహేందర్ రెడ్డి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామంటూ రైతులకు నచ్చజెప్పి విరమింప చేశారు. ధర్నా చేస్తున్న రైతులను బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి, నాయకులు నాగరాజు, మాజీ ప్రజా ప్రతినిధులు అడిగి విషయం తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంటు సరఫరా చేసి పంటలు పండించుకునేలా చూడాలని కోరారు.
అధికారులు శుక్రవారం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా కేసులు పెట్టించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రూ.50 లక్షల చొప్పున ఎకరానికి నష్టపరిహారం ఇస్తామని ప్రస్తుతం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ లు రైతులను రెచ్చగొట్టారని, ఇప్పుడు వారు వచ్చి రైతులకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.