01-08-2025 07:40:41 PM
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని టీయుడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు(District President Cheeti Srinivasa Rao) అన్నారు. శుక్రవారం వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. వృత్తి పరంగా ఎన్నో ఒత్తిడిలకు లోనవుతూ అనారోగ్యానికి గురవుతున్న జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించారు.
జిల్లా కార్యవర్గంలో ప్రాతినిధ్యం లేని మండలాల నుండి స్థానిక ప్రెస్ క్లబ్ బాధ్యుల సూచనతో జిల్లా కమిటీ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఓటర్ లిస్ట్ లో తప్పులను సవరించి అర్హులైన కొత్త సభ్యులకు సభ్యత్వం ఇస్తూ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని సమావేశంలో తీర్మానించారు. మండల ప్రెస్ క్లబ్బులను బలోపేతం చేయడంతో పాటు గడువు ముగిసిన మండల ప్రెస్ క్లబ్ ల ఎన్నికలు నిర్వహించేందుకు కన్వీనర్లను నియమించి రెండు నెలలలోగా ఎన్నికలు జరిపేందుకు తీర్మానించారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా జిల్లాలోని సీనియర్ జర్నలిస్టుల సహకారంతో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జిల్లా యూనియన్ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె. సురేంద్ర కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, లక్ష్మణ్ యాదవ్, టీవీ సూర్యం, ఆదిల్, జిల్లా బాధ్యులు సిరిసిల్ల వేణు గోపాల్, హరికృష్ణ, హైదర్, అల్లే రాము, చంద్రశేఖర్, రాజకుమార్, నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.