09-07-2025 12:00:00 AM
నాగర్‌కర్నూల్, జూలై 8 (విజయక్రాంతి): కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఎల్లూరు పంప్ హౌస్‌ను మంగళవారం పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి, మోటార్లను ఆన్ చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
రూ.8 లక్షల కోట్ల అప్పు చేసినా ప్రాజెక్టులను పూర్తి చేయలేక పోయిందన్నారు. పాలమూరు ఎంజీకెఎల్‌ఐ ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆయకట్టును 4.60 లక్షల ఎకరాలకు పెంచామని పత్రికల్లో చెప్పారుకానీ నీటి విడుదలకు అవసరమైన వసతులు కల్పించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రైతులకు పూర్తి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి చివరి ఆయకట్టుకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ రాజేష్‌రెడ్డి, మెఘారెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు సీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్‌ప్రభు, చంద్రవేఖర్, మరళీ తదితరులు పాల్గొన్నారు.