calender_icon.png 14 October, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలన్నీ వర్షార్పణం

14-10-2025 01:18:26 AM

వరంగల్, యాదాద్రి జిల్లాలో కుండపోత

  1. మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం

వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం 

పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

కోళ్ల ఫారంలో 6 వేల కోళ్లు మృత్యువాత

మహబూబాబాద్/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. మార్కెట్ యార్డులలో ఆరబోసిన ధాన్యం తడిసిమద్దయింది. కొన్ని చోట్ల పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

వరంగల్ జిల్లాలో అనేకచోట్ల మొక్కజొన్న పైరు కోతలు పూర్తిచేసి ఆరబెట్టి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న తరుణంలో వర్షంతో తడిసి పోవడంతో ఆశించిన ధర దక్కని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. పత్తి పంట కూడా చేతికందే దశలో ఉండగా వర్షాలకు పూర్తిగా నేలరాలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో పిడుగుపాటుకు దాసరి సంపత్ అనే రైతుకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి.

మహబూబాబాద్ జిల్లా కురవిలో అత్యధికంగా 13.24 సెం.మీ.ల వర్షం కురవగా, మహబూబాబాద్‌లో 10.96, కొత్తగూడలో 9.12, గంగారంలో 8.84, గూడూరులో 8.9, చిన్న గూడూరులో 8.38, బయ్యారంలో 7.24 కేసముద్రంలో 5.36, నర్సింహులపేటలో 5.74, తొర్రూరులో 4.2, మరిపెడలో 5.2 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యింది. 

యాదాద్రి జిల్లాలో 

యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున గంటసేపు కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు కోళ్ల ఫారంలోకి వర్షం చేరుకుని 6 వేల కోళ్లు మృతి చెందాయి. రూ.12 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. మోత్కూరు, చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఆరబోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది.

తడిసి ముద్దయిన ధాన్యాన్ని చేతులతో ఎత్తుకుంటూ రైతులు బోరుమని విలపించారు. వలిగొండ మండలంలో లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి చేరుకున్న వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేయడంతో ఇండ్లలోని వస్తువులని తడిసి ముద్ద కాగా, మహిళలు, పురుషులు, పిల్లలు ఇండ్లలోకి చేరిన నీటిని బకెట్లతో తోడి బయట పారబోశారు. అదేవిధంగా భువనగిరి ప్రధాన రహదారిపై వలిగొండ మండల కేంద్రంలో నిర్మిస్తున్న కల్వర్టు వద్ద వర్షం వరద భారీగా ప్రవహించింది.