14-10-2025 12:30:49 AM
-గాడి తప్పుతున్న పోలీస్ ఠాణా
-వరుస ఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట
-అయిన వారికే అందాలం, బాధితులపైనే ప్రతాపం
-వ్యవస్థ పట్ల సన్నగిల్లుతున్న నమ్మకం
-ఫ్రెండ్లీ పోలీసింగ్కు తూట్లు..
-రక్షకభట నిలయం.. నిత్య వివాదాలయం
మణుగూరు, అక్టోబర్ 13, (విజయక్రాంతి) : క్రమశిక్షణకు మారు పేరైనా పోలీసులు గాడి తప్పుతున్నారు. నిబంధనలు విస్మరించి ఇష్ట రాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఖాకీల ఇష్టారాజ్యం ప్రజలకు శాపంగా మారుతోంది. సివిల్ పంచాయతీల్లో తలదూర్చవద్దని స్వయంగా ఆ శాఖ ఉన్నతాధికారి డీజీపీ ఆదేశించినా కింది స్థాయిలో అది అమలు కావడం లేదు. పోలీసు ఠాణాలు సివిల్ పంచాయతీలకు అడ్డాలుగా మారుతున్నాయి. కొందరు అధికారులకు కల్ప తరువుగా మారుతోంది.
ఇటీవల కాలంలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సీఐ స్థాయి అధికారి నుండి మొదలుకుని ఎస్త్స్ర వరకు ఏసీబీ దాడులలో పట్టుబడుతున్నా.. వారి తీరు మాత్రం మారడం లేదు. అక్రమలకు రాచమార్గాలైన ఇసుక, మట్కా, పేకాట దందాలలో కొందరు పోలీస్ అధికారులే రింగు మాస్టార్లుగా మారు తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. అందిన కాడికి పుచ్చుకొని ఏమీ ఎరగనట్టుగా వ్యవహరిస్తున్నారనీ తెలుస్తోంది. అక్రమ దందాలలో పోలీసుల తీరు కంచే చేనును మేసినట్టుగా ఉందని విమర్శలు వెలబడుతున్నాయి. అభాగ్యులకు అండగా నిలవాల్సిన మణుగూరు రక్షకభట నిలయం ఇటీవల తరచూ వివాదాలయంగా మారుతోంది. ఇక్కడి పోలీసులకి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన తమకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై విజయ క్రాంతి కథనం..
గతి తప్పుతున్న ఠాణా..
కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమౌతోంది. వారి వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరస్థులు, తప్పుచేసిన వారిని దండించి, బాధితులకు రక్షణ కల్పించాల్సిన వారు, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బాధితులపైనే ప్రతాపం చూపుతుండడం శోచనీయం. వాళ్లు నేరస్థులా, తప్పు చేశారా అని పూర్తి స్థాయిలో విచారించకుండానే స్టేషనకు పిలిపించి తమ మార్కును చూపిస్తున్నారు. పోలీసు ఉన్నత అధి కారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆది అమలు కావడం లేదు.
మరీ దారుణంగా పోలీసు స్టేషనకు వెళ్తే ఎక్కడ తిట్ల దండకం వినాల్సివస్తుందో.. అని స్టేషన్ మెట్ల ఎక్కేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఆ శాఖ ఉన్న తాధికారులు ఓవైపు చర్యలు చేపడు తుండగా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వ హిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల అసంబద్ద తీరుతో ఆ శాఖ అప్రతిష్టను మూటకట్టుకోవాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు రాజకీయ నేతల అండదండలుండటం, రాజకీయ జోక్యం పెరగడంతో ప్రజాప్రతినిధుల చేతు ల్లో పోలీసులు కీలుబొమ్మల్లా మారారన్న ఆ రోపణలు బహిరంగంగనే వినిపిస్తున్నాయి.
తన గ్రామానికి వెళ్లే రైతు రహదారిపై ఇసుక లారీలను నిలపడంతో ఇదేం దాని ప్రశ్నించిన వ్యక్తిపై పోలీసు స్టేషన్ లోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఇసుక కాంట్రాక్టర్ చితకబాదడం, అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించిన తీరు, ఆ శాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. రైతుపై దాడి చేసి దౌర్జ న్యంగా ప్రవర్తించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా ఓ అధికారి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సాధారణంగా పోలీసులు తప్పు చేసిన వారినే స్టేషనకు తీసుకొచ్చి, కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు చెబితే చాలు, బాధితులను సైతం భయపెట్టేందుకు లాఠీకి పనిచెబుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్టేషనకు ఫిర్యాదు చేసేందుకెళ్లిన బాధితులపైనే పోలీసులు ప్రతాపం చూపిస్తుండటంతో వారు విస్తుపోతున్నారు.
పేరుకే ఫ్రెండ్లీ పోలీస్..
పోలీసులు.. ప్రజల పట్ల కఠినంగా వ్యవ హరిస్తేనో, లాఠీలతో కొడితేనో నేరాలు అదుపుచేయలేమని భావించిన ఉన్న తాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు లోకి తీసుకొచ్చారు. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెంచడం దీని ఉద్దేశం. నేరాలు, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు ప్రజలు సహకరిస్తూ సమాచారం ఇస్తారని దీనిని తీసుకొచ్చారు. ఇది ఎక్కడా అమలు కావడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల పలువురు పోలీసులు బాధితుల పట్ల వ్యవహరించిన తీరే నిదర్శనంగా కనిపిస్తుంది.
బాధితులు స్టేషనకు వెళ్తే పోలీసులు ఏమి చేస్తారని భయపడి స్టేషన మొఖం చూడాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కొంతమంది బాధితులు కూడా స్టేషనకు వెళ్తే ఓ వైపు లాఠీ దెబ్బలు, మరోవైపు జేబులకు చిల్లు పడుతుందని భయపడి, బయటే పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు చేసు కోవాల్సిన పరిస్థితి దాపురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి . అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మారిన కొంత మంది పోలీసులు సివిల్ పంచాయితీల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
గాడి తప్పుతున్న స్టేషన్
మణుగూరులో పోలీస్ స్టేషన్ నిత్యం వివాదాల మయంగా మారుతుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్‌లోకి వెళుతున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. స్టేషన్ బెయిల్, ఇతరత్రా ఆరోపణలతో ఇలా విధినిర్వహణలో అలసత్వంతో సీఐ నుండి ఎస్‌ఐ వరకు ఏసీబీకి పట్టిపడిన ఘటనలు పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. అరెస్టులు, లంచాలతో ఏకంగా జైలు పాలవుతున్నారు. అసలు మణుగూరులో పోలీసు శాఖలో ఏంజరుగుతోందన్న చర్చ మొదలైంది. కొందరు అధికారుల మూలంగా ఇక్కడి పోలీసులకు అవినీతి మరకలు అంటుకుంటున్నాయి.
న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన తమకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక నిస్పక్షపాత విధుల నిర్వహణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ వంటి వాటికంటే ఇతరత్రా పనులకే ఇక్కడి పోలీసులు ప్రథమ ప్రాధాన్య మిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా స్థానిక పోలీసులపై మండల ప్రజలకు చులకన భావం ఏర్పడింది. మరోవైపు న్యాయం కోసం స్టేషన్ కు వెళ్లే బాధితుల పట్ల పోలీసు అధికారులు అమర్యాదగా ప్రవర్తిస్తుండడం, దూషణలు, దుర్భాషలు వంటివి చేస్తుండడం వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయి.
దీంతో విసిగిపోయిన బాధితులు ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవలి పరిణామాలు పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మ కాన్ని దెబ్బతీస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రాజకీయ నాయకులకు తలొగ్గకుండా పనిచేయిస్తేనే వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.