14-10-2025 01:14:41 AM
నాగర్‌కర్నూల్, అక్టోబర్ ౧౩ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న విగోల్ జిమ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తిని కొంతమంది వ్యక్తులు అకారణంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనఫై విజయక్రాంతి ప్రతినిధి బొడ్డుపల్లి మల్లేష్ వార్త రాయడంతో పత్రికలో ప్రచురితమైంది. దీంతో దాడి ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తా కథనాన్ని రాసిండని సదరు విజయక్రాంతి ప్రతినిధి ఇంటివద్దకు మారి కార్తీక్‌గౌడ్ అనే వ్యక్తి అతని అనుచరులతో వెళ్లి నా మీదే వార్త రాస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జర్నలిస్టు సంఘం నేతలు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అవినీతి అక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, సంఘ విద్రోహ శక్తులఫై నిత్యం వార్త కథనాలను రాసే జర్నలిస్టులపై ఇలాంటి ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడితే శిక్షించాలని కోరారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలను నిలువరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ స్టేట్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఐజేయు జిల్లా అధ్యక్షుడు పి.విజయకుమార్‌గౌడ్, జిల్లా బాడీ ఈసీ మెంబర్ ప్రసాద్, తాలూకా ఉపాధ్యక్షుడు రాంప్రకాష్, తాలూకా కార్యదర్శి ధర్వేశ్, జర్నలిస్టు సంఘం సీనియర్ నాయకులు హకీమ్ కిషోర్, గుండూరు శ్యామ్, మాధవరెడ్డి, శీనుబాబు, సీనియర్ జర్నలిస్టులు టి.ప్రదీప్, జర్నలిస్టులు హర్ష, ఇతర సంఘం నాయకులు బాదం పరమేష్ ఉన్నారు.