calender_icon.png 14 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ పార్టీలో విభేదాలు!

14-10-2025 12:28:27 AM

  1. మెదక్ సీటుపై ఇప్పటి నుంచే కర్చీఫ్

కార్యకర్తల్లో ఆందోళన 

పద్మారెడ్డి, తిరుపతిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం మౌనం

మెదక్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ పార్టీలో గ్రూపు విబేధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా  వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మూడు గ్రూపులుగా విడిపోయారు.

ఏదైనా పార్టీ పెద్దలు హాజరయ్యే కార్యక్రమానికి మినహా ఇతరత్ర కార్యక్రమాల్లో ఎడమొహం పెడమొహంలా వ్యవహరిస్తుండడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హాజరయ్యారు.

కానీ కంఠారెడ్డి  తిరుపతిరెడ్డి మాత్రం కనిపించలేదు. ఏమిటని ఆరా తీస్తే తనకు ఆహ్వానం లేదని అందుకే హాజరుకాలేదని తెలిసింది. కాగా ఆదివారం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తన సొంత మండలం నిజాంపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మాదేవేందర్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి హాజరుకాలేదు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రానున్న ఎన్నికల్లో మెదక్ నుండి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు కంఠారెడ్డి స్పష్టంగా సమాధానం ఇచ్చారు.

రానున్న రోజుల్లో మెదక్ అసెంబ్లీ సీటు తనకేనని, అధిష్టానంపై తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా  తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా పద్మాదేవేందర్రెడ్డి వర్గీ యులతో పాటు ఇతరులకు మింగుడు పడకుండా అయిందని ప్రచారం. 

ఇప్పటి నుండే సీటుపై కర్చీఫ్...?

మెదక్ అసెంబ్లీ సీటుపై గులాబీ పార్టీలో ఇప్పటి నుండే పోటీ నెలకొంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు వర్గాలుగా విడిపోయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పద్మాదేవేందర్రెడ్డి వ్యవహార శైలితో కార్యకర్తలు దూరం పెట్టడంతోనే ఓటమి పాలయ్యారు. తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్లో చేరకముందు నియోజక వర్గంలో పద్మకు, శేరి సుభాష్రెడ్డి మధ్య విబేధాలు పొడచూపాయి.

రెండు గ్రూపులుగా పార్టీ కార్యకర్తలు వ్యవహరించా రు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్టు దక్కకపోవడంతో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడం, కంఠారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొనసాగించిన వ్యవహార శైలితో పద్మాదేవేందర్రెడ్డి వర్గీయులకు మింగుడు పడలేదు. నియోజకవర్గంలో పార్టీలకతీతంగా కంఠారెడ్డి కార్యకర్తలను ఆదుకోవడం, ఆర్థిక సహాయం చేయడంతో మంచి గుర్తింపు రావడంతో అసెంబ్లీ సీటుకు పోటీ పెరిగినట్లు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పద్మదేవేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి మధ్య దూరం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. పలుమార్లు పార్టీ కార్యక్రమాలకు తిరుపతిరెడ్డికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన కూడా తన మద్దతును పెంచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు శేరి సుభాష్రెడ్డి మౌనంగా పరిశీలి స్తున్నట్లు తెలిసింది. 

అయితే కంఠారెడ్డి రాబోయే అసెంబ్లీ  ఎన్నికల్లో తనకే సీటు ఇస్తారని, అధిష్టానం మాట ఇచ్చిందని మీడియా ముఖంగా స్పష్టం చేస్తుండడం పట్ల పద్మ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. ఓవైపు అధికారం కోల్పోయి బీఆర్‌ఎస్ పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో సొంత పార్టీలోనే గ్రూపు విబేధాల తలనొప్పి ఎక్కువవుతుందని భావిస్తు న్నారు. మాజీ మంత్రి హరీష్రావు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, గ్రూపు విబేధాలు సద్దుమణిగేలా చేస్తారా అనేది వేచిచూడాల్సిందే.