14-10-2025 01:17:45 AM
కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోరట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ను సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే అటవీశాఖ సిబ్బందితో కలిసి వాలీబాల్ ఆడి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. కలెక్టర్ స్మాష్లు, ఎస్పీ సర్వీసులు చేయగా సిబ్బంది ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జోన్ స్థాయి అధికారుల మధ్య వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారం, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై నాటకాలు, పాటలు కూడా ప్రదర్శించనున్నారని సీసీఎఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, మండల అటవీ అధికారులు, పరిశీలకులు, సామాజిక అటవీ సిబ్బంది, గ్రామ అటవీ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోన్ స్థాయిలో విజేతలకు చివరి రోజు పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు. తొలుత ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఐదు జిల్లాల డీఎఫ్‌ఓలు, అటవీ శాఖ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.