31-08-2025 01:14:19 AM
-పంటకు అతిగా వాడితే అనర్థమే
-పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం
-రైతులకు తగ్గుతున్న దిగుబడులు
-పెరుగుతున్న పెట్టుబడులు
-సమగ్ర వ్యవసాయ విధానాలు మేలంటున్న నిపుణులు
పంటల నుంచి అధిక దిగుబడును సాధించాలన్న ఆశతో రైతు అవసరానికి మించిన రసాయనిక ఎరువులను వాడుతున్నాడు. రానురాను వీటి వాడకం పెరగడంతో ఆశించిన ఫలితం రాకపోగా అనర్థాలకు దారి తీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా వినియోగాన్ని పెంచడంతో అది దొరకక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలలో గంటలు, రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఓ రైతు తన పొలంలో ఒక బస్తా యూరియా వేస్తే.. పక్క పాలం రైతు మరింత ఎక్కువ జల్లుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎరువుల మోతాదు పెరగడం ఫలితంగా భూసారం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగడం జరుగుతుంది.
పర్యావరణంపైనా ప్రభావం
అధిక దిగుబడులు సాదించాలన్న అత్యాశతో ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడితే పంటలు, పర్యావరణంపైనా ప్రభావం చూపుతోంది. పంటలకు వేసిన ఎరువులు కొంత నీళ్లలో కరుగక చెరువులు, నదుల్లోకి చేరి ఆ నీటిని కలుషితం చేస్తున్నాయి. అందుకే యూరియాను మితంగా వాడితేనే హితమని చెబుతున్నారు అనుభవజ్ఞులు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, రసాయన మందులు వేసే దశకు వివిధ పంటలు చేరుకున్నాయి. ఈ సమయంలో ఏ పంటకు ఎరువులు ఎప్పుడు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి వంటి విషయాల గురించి నిపుణులు వివరించారు.
ఎరువులు ఇలా వాడాలి
వరిలో ఎకరానికి 120 కిలోల యూరియా, 60 కిలోల డీఏపీ లేదా కాంప్లెక్స్ (భాస్వరం) ఎరువులు, 40 కిలోల పొటాష్ (ఎంవోపీ) వాడాలి. పత్తిలో 120 కిలోల యూరియా, 60 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్, మిర్చిలో 220 కిలోల యూరియా, 80 కిలోల భాస్వరం, 60 కిలోల వరకు పొటాష్ వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో పైపాటుగా వాడొద్దు. వీటిని దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. లేదా పంట నాటిన 15-20 రోజుల్లో అందించాలి. వరిలో విషగుళికలతో కలిపి యూరియా చల్లకూడదు. పొలంలో యూరియా వేసేటప్పుడు నీరు ఉండొద్దు. గుళికలు చల్లినప్పుడు నీరు ఉండాలి. రెండింటిని కలిపి ఒకేసారి వేస్తే వీటిలో ఏదో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. రెండోదాని ప్రభావం పంట మొక్కలపై ఉండదు. వరిలో ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టాలి. పత్తిలో మొక్కకు రెండు అంగుళాల దూరం, రెండు అంగుళాల లోతులో ఎరువులు వేయాలి.
గణనీయంగా పెరిగిన ఎరువుల వాడకం
పంట దిగుబడులు పెంచాలన్న రైతుల ఆలోచనే ఎరువుల వాడకంను గణనీయంగా పెంచింది. పంటల్లో ఎరువుల వాడకం పెరగడం ఫలితంగా భూసారం తగ్గుతున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా అవసరమైన ఎరువుల కన్నా వేల టన్నులు అధికంగా వాడుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ మందుల వాడకంలోనూ రైతులు ఇలానే చేశారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రైతులు ఎరువులను ఎంతగా వినియోగిస్తున్నరనేది స్పష్టంగా అర్థం అవుతోంది.
యూరియా ఎక్కువగా వాడితే కలిగే నష్టాలు
వరిలో అధికంగా యూరియా వేస్తే ఏపుగా పెరిగి కోత కంటే ముందే నేలపై వాలిపోతోంది. పంటలపై రసం పీల్చే పురుగు ఉధృతి పెరుగుతుంది. అలాగే సుడిదోమ ప్రభావం కూడా ఎక్కువ అవుతోంది. పత్తిలో ఎక్కువైతే ఆకులు బాగా పెరిగి దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. మొక్కల్లో రోగ నిరోధక శక్తి తగ్గి చీడ,పీడల సమస్య ఎక్కువవుతోంది. అలాగే భూమిలో జింక్, మెగ్నీషియం లోపాలు తలెత్తుతాయి. అదేవిధంగా పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. రైతులకు పెట్టుబడి భారం పెరుగుతోంది. ఎకరం పంటలో నత్రజని (యూరియా), భాస్వరం, పొటాష్‌లు 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా వీటిని 8:4:1 నివృత్తిలో వినియోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
నట్టె కోటేశ్వర్ రావు, సూర్యాపేట స్టాఫర్
సేంద్రియ ఎరువులను వేస్తున్నా..
పంట దిగుబడి ఎక్కువగా రావాలని గతంలో అధికంగా రసాయనిక ఎరువులను వాడాను. కొద్దిమేర దిగుబడి పెరిగినా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. పంట పూర్తి అయిన తర్వాత చూసుకుంటే అప్పులే మిగిలాయి. దీంతో పంటకు సేంద్రియ ఎరువులను వేయడం ప్రారంభించా. ఖర్చు తగ్గింది. దిగుబడి పెరిగింది. మొత్తానికి ఇప్పుడు ఆశాజనకంగా ఉంది.
గుండు సతీశ్, విజయ రాఘవపురం, మునగాల మండలం.
అవసరానికి మించి ఎరువులు వేయొద్దు
రైతులు కేవలం పంట దిగుబడులు పెరుగుతాయన్న ఆలోచనతోనే అవసరానికి మించి ఎరువులను వేస్తున్నారు. దీంతో పంట మొక్కలు ఏపుగా పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గి చీడపీడలు ఆశిస్తాయి. కాబట్టి రైతులు దీనిని అర్థం చేసుకొని ఎరువులను అవసరమైన మేరకు తగు మోతాదులో వాడాలి. సాగు చేసిన పంటపై ఇష్టం వచ్చినట్టుగా ఎరువులు వాడకుండా నిపుణుల సలహాల మేరకే వేసుకోవాలి. సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తేనే రైతులు ఆశించిన దిగుబడులు సాధించగలుగుతారు.
దొంగరి నరేశ్, కేవీవకే శాస్త్రవేత్త,గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా.