22-09-2025 12:54:39 AM
రంగారెడ్డి, సెప్టెంబర్ 31,( విజయ క్రాంతి): చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ.... బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోనా అంటూ బతుకమ్మ పాటలతో పల్లెలు పట్టణాలన్నీ హోరెత్తాయి. ఆదివారం రంగారెడ్డి,వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ప్రజలంతా సంబురంగా జరుపుకు న్నారు. వేడుకలను పురస్కరించుకొని ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తూ బొడ్డెమ్మలను పేర్చారు.
తమ ఇంటి ఇంటి వాకిట్లో బతుకమ్మ లను పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు ఆలపిస్తూ గౌరమ్మను వేడుకొన్నారు. వేడుకలో మహిళలతో పాటు పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను ఎత్తుకొని ర్యాలీగా వెళ్లి చెరువులు, కుంటలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ గాట్ల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నేతలు అధికారులు పాల్గొన్నారు.
ఘట్ కేసర్ మండలంలో ..
ఘట్ కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి సాంద్రాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండగ ఉమ్మడి ఘట్ కేసర్ మండలంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైనది. అమావాస్య నుంచి 9 రోజుల పాటు కొనసాగే ఈపండగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మహిళలు, యువతులు ఎంతో ఇష్టంగా పూల పండగ బతుకమ్మ వేడుకలో పాల్గొంటారు.
ఆడపడుచులు ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువులలో నిమజ్జనం చేస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మలో మహిళలు, యువతులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ వంటి సాంప్రదాయ గీతాలు ఆలపిస్తూ ఆటపాటలతో సంబురంగా జరుపుకున్నారు.