22-09-2025 12:55:21 AM
-నేటి నుంచి భద్రకాళి ఆలయంలో వేడుకలు
-రోజుకో అలంకరణలో అమ్మవారు
-పసుపు చూర్ణంతో అభిషేకించిన పూజారులు
-పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
వరంగల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తులతో జరుపబడే శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగినది. ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట జగత్ప్రసూతికా అలంకారం జరిపి భక్తులకు అమ్మవారి హరిద్రా దర్శనాన్ని కల్పించారు.
భక్తులు సమర్పించిన 27 కిలోల స్వచ్ఛమైన హరిద్రా (పసుపు) చూర్ణంతో అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించారు. అతంకుముందు పూజారులు వైదికమైన క్రతువు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం జరిపి హరిద్రామయమైన అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పించారు.
జగత్ప్రసూతికా అలంకారం హరిద్రా దర్శనం నేపథ్యాన్ని భద్రకాళి శేషు భక్తులకు వివరించారు. అనంతరం వాస్తు యాగం, పర్యగ్నికరణం జరుపబడి సాయంకాలం అంకురార్పణ జరుపబడినది. సోమవారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకంతో విశ్వావను నామ సంవత్సర దేవీశరన్నవరాత్రులు ఆలయంలో ప్రారంభించనున్నట్లు ఈవో రామల సునీత తెలిపారు.