04-09-2025 09:28:11 PM
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సిపి..
హుజురాబాద్: గణేష్ నిమజ్జనాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం(CP Ghaus Alam) ఆదేశించారు. హుజురాబాద్ లోని కేసీ కెనాల్, జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్, జమ్మికుంటలో నిమజ్జనం కోసం ఘాట్లను ఏర్పాటు చేశామని, వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయని అన్నారు. నిమజ్జనం స్థలాల వద్ద భారీ గేట్లు, లైటింగ్, మెడికల్ క్యాంప్, పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఇన్చార్జ్ ఏసిపి శ్రీనివాస్ జీ, సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బంది, వివిధ వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.