calender_icon.png 23 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొదుపు సంఘాల్లోకి 15 ఏళ్లకే ప్రవేశం

23-10-2025 12:16:30 AM

  1.   60 దాటినా నో రిటైర్‌మెంట్ 
  2. స్వయం సహాయక బృందాలపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయాలు  
  3. మార్గదర్శకాల్లో సవరణలు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్య సాధన దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక బృందాల పొదుపు సంఘాల మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. ఇకపై 15 ఏళ్లు నిండిన బాలి కలు సైతం సంఘాల్లో సభ్యులుగా చేరొచ్చు.

అలాగే 60 ఏళ్లు దాటిన మహిళలు రిటైర్ కావాలన్న నిబంధనను తొలగించి, వారు ఇష్టమున్నంత కాలం కొనసాగేందుకు అవకాశం కల్పించింది.జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం స్వయం సహాయక బృందాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి .ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన యువతులను మాత్రమే సంఘాల్లో సభ్యులుగా చేర్చుకునేవారు. యువతుల దశ నుంచే ఆర్థిక క్రమశి క్షణ, ఆదాయ వనరులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వయోపరిమితిని 15 ఏళ్లకు తగ్గించారు.

గతంలో 60 ఏళ్లు నిండిన మహిళలను సంఘం నుంచి తప్పించి, వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకునేవారు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ, 60 ఏళ్లు దాటిన సభ్యులు తమకు ఇష్టమున్నంత కాలం సంఘంలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రతి మహిళనూ పొదు పు సంఘాల పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025.-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలోని 55,897 స్వయం సహాయక బృందాల సంఖ్యను రెండింతలు చేసి, 1.10 లక్షలకు పైగా పెంచాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఈ లక్ష్యాన్ని మార్చి నెలాఖరులోగా చేరుకోవాలని అదనపు కమిషనర్ యూసీడీ ఎస్. పంకజ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్తగా 4,842 బృందాలను ఏర్పాటు చేసి, వాటికి రూ. 454.68 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. పొదు పు సంఘాలతో పాటు, జీహెచ్‌ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ యూసీడీ విభాగం ఇతర పథకాల ద్వారా కూడా మహిళలకు, వీధి వ్యాపారులకు అండగా నిలుస్తోంది.

వీధి వ్యాపారులకు మూడు విడతలు గా రుణాలను అందిస్తున్నారు. లోక్ కల్యాణ్ మేళాలో భాగంగా వెయ్యి మంది వీధి ఆహార వ్యాపారులకు శిక్షణ ఇచ్చి, ఉచితంగా భద్రతా కిట్లు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్లను అందజేశారు. భిక్షాటన చేసేవారిని, నిరాశ్రయులను గుర్తించి జీహెఎంసీ నైట్ షెల్టర్లకు తరలించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.