27-09-2025 01:56:46 AM
స్టీరింగ్ కమిటీ సభ్యుల నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మోడల్ స్కూళ్లలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వివిధ సంఘాలన్నీ కలిసి తెలంగాణ మోడ్ స్కూల్ సంఘాల ఐక్య వేదికగా ఏర్పాటైనట్లు తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్) అధ్యక్షుడు బి.కొండయ్య తెలిపారు. ఈమేరకు శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి వివిధ సంఘాల బాధ్యులు హాజరై తెలంగాణ మోడల్ స్కూల్ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు విడుదల, నోషనల్ సర్వీస్, పెండింగ్ బకాయిల చెల్లింపు, కారుణ్య నియామకాలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్.విఠల్, టీ.అరవింద్ గోష్, వెంకటేష్ గౌడ్, సాజిద్, శివప్రసాద్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.