calender_icon.png 10 May, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిరవుతున్న ఆహార భద్రత

09-07-2024 12:00:00 AM

వాతావరణం విపరీతంగా వేడెక్కితే ఆర్థిక భద్రత ఆవిరవుతుందని, భూతాప ప్రభావంతో ఆర్థిక వనరులు మూసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరుగుతా యని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులతో సాలీనా ప్రపంచవ్యాప్తంగా 38 ట్రిలియన్ డాలర్ల నష్టం చవిచూడవలసి వస్తుందని వారు వాపోతున్నారు. 2050 నాటికి వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 19 శాతం (19 ట్రిలియన్ డాలర్ల నష్టం) వరకు కుంచించుకుపోయే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. రానున్న శతాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఆర్థిక ప్రగతి 33 శాతం తగ్గుతుం దని కూడా అంచనా వేశారు.

పర్యావరణ విధ్వంసంతోపాటు భూతాపమూ తీవ్రమైతే వ్యవసాయ రంగమేకాక స్థూల ఆర్థికం, ఆర్థికరంగ వ్యవస్థలకూ పెను ప్రమాదం కలుగుతుందని వింటున్నాం. ప్రపంచ దేశాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలతో మానవాళి ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఒక సంక్లిష్ట సమస్యగా మారుతున్నది. ఉష్ణోగ్రతలు పెరు గుదలవల్ల ప్రమాదకర వడగాలులు, పవన తుపాన్లు, వరదలు, కరువు కాటకాలు వంటి విపత్తులు ప్రపంచ ప్రజల ను కుదపడం ఖాయమని తెలుస్తున్నది.

  ప్రతికూల ప్రభావాలు

వాతావరణ మార్పుల పర్యవసానంగా వ్యక్తిగత, గృహ ఆదాయాలు, ఆర్థిక విభాగాలు, ఎనర్జీ మార్కెట్, ద్రవ్యోల్బణ కుదుపులు, ఆర్థిక, ఇన్నొవేషన్ రంగాలు లాంటివి ప్రత్యక్ష ప్రభావానికి లోనవుతాయని నిపుణులు తేల్చారు. ఈ స్థితి మానవ సమాజంపై బహు రుగ్మతలకు కారణమవుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేర్వేరు ప్రభావాలను చూపడంతో ఆర్థికాభివృద్ధి, ఉత్పాదకత, సమర్థతలపై తీవ్ర విఘాతం కలుగుతుంది. ప్రత్యామ్నాయ పునరుత్పాదక శక్తి వినియోగం పెరిగితేనే కార్బన్ ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. అప్పుడే జీరో ఉద్గార స్థాయికి క్రమంగా చేరడం సాధ్యమవుతుంది. సంప్రదాయేతర ఇంధనాల వినియోగం పెరగడానికి పన్నుల తగ్గింపు, సబ్సిడీల పెంపు, నిబంధనల సడలింపులు కొనసాగాలి. 

కట్టడి మార్గాలు

వాతావరణ మార్పులను కట్టడి చేయడానికి ఉద్గారాల తగ్గింపుకు ఉపకరించే శిలాజ ఇంధన వినియోగానికి దారుల్ని క్రమంగా మూసేయాలి. హరిత క్షేత్రాల విస్తీర్ణం పెంపు, అడవుల నరికివేతను కట్టడి చేయాలి. కార్చిచ్చులకు చరమగీతం పాడాలి. హరిత జీవన శైలిని పాటిస్తూ, నేల ఎడారీరకణను తగ్గించాలి. ప్రపంచ దేశాలన్నీ చేతులు కలిపి పట్టుదలతో సమన్వయంగా ఈ కృషి సల్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు అధిక ఆర్థిక వనరులను కల్పించడం తప్పనిసరి. విద్యుత్ (ఈవి- రవాణా) వాహనాల వినియోగాన్ని పెంచుతూ, శక్తి పొదుపు టెక్నాలజీని చేపట్టాలి. సుస్థిర భవన నిర్మాణాలు, పారిశ్రా మిక కాలుష్యాల కట్టడి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడం లాంటి పలు చర్యలూ వెంటనే సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

వాతావరణ ప్రతికూల మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి సరైన పాలసీల పునఃసమీక్షలు అవసరం. మెరుగైన ప్రణాళికల్ని పటిష్టతతో ప్రపంచవ్యాప్తంగా వడివడిగా, సమర్థవంతంగా అమలులోకి తేవాల్సి ఉంటుంది. ఈ ఊబిలోంచి బయట పడడానికి అనువైన చర్యలను తీసుకోవడం మనందరి కనీస కర్తవ్యంగా గుర్తిద్దాం.

 డా.బుర్ర మధుసూదన్ రెడ్డి