calender_icon.png 19 September, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 నుంచి కాకతీయ నృత్య నాటకోత్సవాలు

19-09-2025 12:04:19 AM

  1. రెండు రోజుల పాటు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ప్రదర్శనలు
  2.   30 మంది కళాకారులచే చాకలి ఐలమ్మ నృత్య రూపకం
  3. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ: అలేఖ్య పుంజాల 

హనుమకొండ సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణి రుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 21న మధ్యాహ్నం 3గంటలకు డాక్టర్ అలేఖ్య పుంజాల నృత్య దర్శకత్వంలో 30 మంది కళాకారులు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శిస్తారు.

చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను కళ్ల ముందుంచే ఈ నృత్య రూపకాన్ని డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించగా సంగీత దర్శకుడు వీబీఎస్ మురళి సంగీతం సమకూర్చారు. 22న సాయంత్రం 6 గంటలకు తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ సదానందం నిర్వహణలో రాణి రుద్రమ నాటకం, అనంతరం గద్దర్ ఫౌండేషన్ సూర్య ఆధ్వర్యంలో ప్రజా సాహిత్య కళా రూపాలు జీవన సంఘర్షణ ప్రదర్శనలు వుంటాయని అలేఖ్య పుంజాల వివరించారు.

కాకతీయ నృత్య నాటకోత్సవాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ పాల్గొంటారు.  తెలంగాణ సంగీత నాటక అకాడమి తొలిసారి నిర్వహిస్తున్న కాకతీయ సాంస్కృతికోత్సవాలకు ఉచిత ప్రవేశమని కళాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని ఆలేఖ్య విజ్ఞప్తి చేశారు.