calender_icon.png 19 September, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో పోలీసుల కాల్పులు

19-09-2025 12:06:50 AM

  1. పాలమూరు యువకుడి దుర్మరణం
  2. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన నిజాముద్దీన్
  3. అద్దె గదిలో స్నేహితుల మధ్య గొడవ
  4. ఆపేందకు వచ్చి, కాల్పులు జరిపిన పోలీసులు
  5. ఆ తూటా తగిలి నిజాముద్దీన్ మృతి

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అమెరికాలో పోలీసులు జరిపిని కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాను అద్దెకు ఉంటున్న గదిలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న గొడవను ఆపేందుకు అక్క డి పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడే ఉన్న నిజాముద్దీన్ ఆమెర్‌కు బుల్లెట్ తగిలి మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న మహమ్మద్ హస్‌నుద్దీన్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్(29) ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి.. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం జాబ్ ఒప్పందం ముగియడంతో ఎక్స్‌టెన్షన్ లేక తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. వారిలో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వచ్చినా గొడవ ఆగకపోవడంతో వారు కాల్పులు జరిపారు. దీంతో ప్రమాదవశాత్తు ఆ తూటా వెళ్లి నిజాముద్దీన్‌కు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని స్నేహితులు మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. చికాగోలో ఉంటున్న మృతుడి మామ ఘటనా స్థలికి వెళ్లారు. కాగా 8 రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని తన తల్లిదండ్రులతో నిజాముద్దీన్ మాట్లాడినట్లు స్థానికులు చెపుతున్నారు.