calender_icon.png 15 September, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల బియ్యంపైనా ఖాకీల కక్కుర్తి!

15-12-2024 02:38:14 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సైల అవినీతి లీలలు

కాకినాడ పోర్టుకు రైస్ తరలించేందుకు సహకారం

‘సీసీఎస్’ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు

తప్పించుకునేందుకు మంత్రుల చుట్టూ ఎస్సైల ప్రదక్షిణ 

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ‘రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది’ అని ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ సమావేశంలో ఎంతో గొప్పగా ప్రకటించారు. ఇప్పుడు ఆయ న ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లానుంచే పెద్దమొత్తంలో రేషన్ బియ్యం ఏపీలోని కాకినాడ పోర్టుకు తరలుతుండటం, పోలీసులే అందు కు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తుండటం మంత్రి మాటలు ఉత్త మాటలేనని తేలుస్తున్నాయి.

కొందరు ఎస్సైలు ముఠాగా ఏర్పడి దందా నడిపిస్తూ అక్రమార్కుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రధాన రహదారులతో పాటు జాతీయ రహదారిపై రేషన్ బియ్యం తరలుతున్నా పోలీసులు సీజ్ చేయ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బియ్యాన్ని పట్టుకున్నా పౌర సరఫరాలశాఖను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిసింది. అక్రమార్కుల మామూళ్ల మత్తులో జోగుతూ పోలీ సులు రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా అరికట్టాల్సిన పోలీసులే బ్రోకర్లతో చేతులు కలపడం చర్చనీయాంశమైంది. 

ఒకే బ్యాచ్‌కు చెందిన ఎస్సైల పనే..

అక్రమార్కులు ఉమ్మడి నల్లగొండ నుంచి కాకినాడ పోర్టుకు 240 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా, పోలీస్ తనిఖీల్లో విషయం బయ టపడింది. సమాచారం అందుకున్న రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సీసీఐ పోలీసులతో కలిసి విచారణ ప్రారంభించారు. విచారణలో ఎస్సైల సహకారంతోనే దందా సాగుతున్నదని నిందితులు సీసీఐ పోలీసులకు తెలపడం గమనార్హం.

దందా వెనుక సూర్యాపేట, నల్లగొండ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయంతో పాటు 2015 బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది సబ్ ఇన్‌స్పెక్టర్ల  పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. రెండేళ్ల నుంచి దందా సాగుతున్నదని సమాచారం. మరోవైపు ఐజీ సత్యనారాయణ రెండు రోజుల క్రితం రెండు జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించి, పీడీఎస్ రైస్ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు.

దీనిలో భాగంగానే పోలీసులు సూర్యాపేటకు చెందిన శంకర్ గౌడ్ ముఠాను అరెస్టు చేశారు. బియ్యం అక్రమ రవాణాలో పోలీసుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీడియా ఐజీకి ఆ ప్రశ్న సంధించింది. దీనిపై ఐజీ సమాధానమిస్తూ.. ‘అక్రమార్కుల వెనుక ఎవరి పాత్ర ఉందనేది విచారణలో తేలుస్తా’మన్నారు. అప్పటి నుంచి కొందరు ఎస్సైలు పోలీస్‌స్టేషన్లలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా, మంత్రులను కలిసే పని పెట్టుకున్నట్లు తెలిసింది.

రెండు జిల్లాల్లోనూ అక్రమార్కులు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాలో నలగొండ జిల్లా పరిధిలోని చండూరు సర్కిల్‌లోని ముగ్గురు ఎస్సైలు, హలియా సర్కిల్ నుంచి ఒకరు, నల్లగొండ సర్కిల్ పరిధిలో ఒకరు ఉన్నట్లు విచారణలో తేలినట్లు బయటపడిం ది. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, హుజూర్‌నగర్ సర్కిళ్లలో మరో ముగ్గురు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చక్రం తిప్పుతున్న ఎస్సైలంతా రాజకీయ పైరవీలతో పోస్టింగ్స్ తెచ్చుకున్నట్లు సమాచారం.

మరోవైపు ఎస్సైలను విచారణ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. విచారణ ఎదుర్కొంటున్న ఎస్సైలు సైతం ఎవరికి వారు, తమ రాజకీయ పలుకుబడులను వినియోగించి అభియోగాల నుంచి బయటపడాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.