15-09-2025 05:40:39 PM
హైదరాబాద్: యూరియా విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని, సరిపడా యూరియాను ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) పేర్కొన్నారు. రైతుల పక్షాన మోదీని, కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎందుకు నిలదీయటం లేదు అని, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీకి భయపడుతున్నారని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు బిగుసుకుంటాయని బీఆర్ఎస్ లో భయం పుడుతుందని.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్ దేనని అన్నారు. కేసీఆర్(KCR) ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. నాలుగేళ్లు పెండింగ్ వల్ల ఇప్పుడు ప్రభుత్వంపై భారం పెరిగిందని విమర్శించారు.
పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ బీఆర్ఎస్ ప్రజల ఆదరణ లేదని.. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం తప్ప.. బీఆర్ఎస్ చేసిందేమి లేదని తెలిపారు. కేటీఆర్(KTR) భాష, సంస్కృతి బాగా లేదు.. సీఎంపై వ్యక్తిగత దూషణలు సరికాదు అని ఆరోపించారు. కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల భయం పట్టుకుందని.. డిపాజిట్లు రావని కేటీఆర్ కు అర్థమైందని పేర్కొన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ల కోసం అసత్యాలు చెబుతున్నారని.. హైదరాబాద్ లో ఎదో పొడిచామని కేటీఆర్ అనుకుంటున్నారని తెలిపారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోస్థానంలో ఉందని.. హైదరాబాద్ కు కేసీఆర్ చేసిందేమి లేదని.. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పని ముగిసిందన్నారు.