calender_icon.png 14 November, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నీటి బిందువు అమూల్యం

14-11-2025 01:04:35 AM

  1. ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణకు పునాది..
  2. మనబడి నీరు కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, నవంబర్13(విజయక్రాం తి): ప్రతి నీటి బిందువు అమూల్య మని, ప్రజల భాగస్వామ్యంతోనే స్థిరమైన నీటి వనరుల సంరక్షణ సాధ్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (జల్ సంచయ్  జన్ భాగీదారీ) అమలులో భాగంగా నిర్వహించిన‘మన బడి  మన నీరు కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

ముందుగా అంబేద్కర్ కూడలి నుండి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో న్యూట్రీ గార్డెన్, ఇంకుడు గుంత, గిరిజన ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గది, వర్షపు నీటి నిల్వ గుంతలను కలెక్టర్ ప్రారంభించారు. జల్ సంచయ్‌జన్ భాగీదారీ పథకం విజయవంతమైన అమలుకు గాను ఈనెల 18న జిల్లా కలెక్టర్కు అవార్డు లభించనున్న సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

ప్రముఖ కవి, రచయిత అందేశ్రీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన చేసిన సాహిత్య సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ అత్యవసరమని, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో నీటి వనరులను కాపాడే దిశగా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. భూగర్భ జలాలు క్షీణిస్తున్న తరుణంలో వర్షపు నీటిని నిల్వచేసే ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు, సోక్ పిట్లు నిర్మించాలన్నారు. నీటి ప్రతి బిందువు అమూల్యం. ఈ రోజు మనం సంరక్షిస్తేనే రేపటి తరాలకు అందించగలుగుతా మని తెలిపారు.

జిల్లాలో వర్షపాతం అధికంగా నమోదవుతున్నప్పటికీ నిల్వ నీటి వనరుల కొరత ఉందని, అందువల్ల ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాల స్థాయిలో అవగాహన సృష్టించి విద్యార్థుల ద్వారా కుటుంబాలకు సందేశం చేరవేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కమ్యూనిటీ సోక్ పిట్కు 18 వేలు, రూఫ్టాప్ రేన్వాటర్ హార్వెస్టింగ్ యూనిట్కు 25 వేలు మంజూరు చేస్తున్నామని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నీటి ప్రాధాన్యం, వృథా కాకుండా వినియోగం, వర్షపు నీటి నిల్వ పద్ధతులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతం లో ప్రజలు వర్షాల కోసం కప్పతల్లి పూజ లు, పాటల ద్వారా ప్రార్థించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం వాతావరణ మార్పు ల నేపథ్యంలో నీటిని జాగ్రత్తగా వినియోగించడం అత్యంత అవసరమని తెలిపారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటల సాగుకు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల సహకారమే ఈ కార్యక్రమ విజయానికి మూలం అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ , డిఆర్డిఓ రవీందర్, డిడీ అంబాజీ, ఐటిడిఓ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.