calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి

26-11-2025 12:26:53 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నవంబరు 25 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీస్ మున్సిపల్ నేషనల్ హైవే ఆర్ అండ్ బి ఆర్ టి సి అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు.

వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారకమంత్రమని, పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో వాటి నియంత్రణకు భద్రత చర్యలు చేపడతామన్నారు. మొత్తానికి రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా కరీంనగర్ జిల్లాను అధికారులంతా సమిష్టిగా తీర్చిదిద్దాలని సూచించారు.

కరీంనగర్ సిపి గౌష్ ఆలం.. జిల్లాలో ఆయా రహదారులపై రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ తరఫున బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ టు హైదరాబాద్ వరంగల్ రూటు జగిత్యాల సిరిసిల్ల చొప్పదండి రూట్ లో రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ఆయా రహదారుల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించామని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పోలీస్ శాఖ నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని దీనివల్ల కొంతవరకు రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేశామని చెప్పారు. జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనం వేగం ఉండాలని పరిమితికి మించి వాహనాన్ని నడిపినట్లయితే స్పీడ్ గన్ ద్వారా గుర్తించి సిబ్బంది జరిమానా వేస్తామని చెప్పారు. వాహన దారులు కచ్చితంగా వాహనానికి సంబంధించిన కాగితాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, శ్రీనివాస్ జి, యాదగిరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.