19-11-2025 12:48:01 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 18 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సమక్షంలో అధికారులు, ఉద్యోగులు అందరూ కలసి మాదకద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గంజాయి తోపాటు ఇతర మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన అక్రమ రవాణా చేసిన ఆ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, టీజేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, వైద్య శాఖ అధికారి డా.మనోహర్, జిల్లా పలు విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.